"వన సంరక్షిణి" వార్తాలేఖ ఆవిష్కరణ
"వన సంరక్షిణి" వార్తాలేఖ (న్యూస్ లెటర్) ఆవిష్కరించిన రాష్ట్ర అటవీ దళాధిపతి, ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి శ్రీ పి మల్లికార్జునరావు, ఐ. ఎఫ్.ఎస్. "వనసంరక్షిణి" ప్రారంభ సంచిక ను గురువారం నాడు రాష్ట్ర అటవీ దళాధిపతి గుంటూరు, అరణ్య భవన్ లో గల ఆయన ఛాంబర్లో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ సంరక్షణ కృషిలో శాఖ సాధిస్తున్న విజయాలను, వన సంరక్షణ సమితుల సాఫల్య గాధలను ప్రభావవంతంగా ఆవిష్కరించేందుకు ఈ న్యూస్ లెటర్ దోహదపడాలని ఆకాంక్షించారు. ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి ఏకే మౌర్య, అదనపు ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి ఆర్ పి ఖజూరియా మాట్లాడుతూ మిషన్ హరితాంధ్ర ప్రదేశ్ లో భాగంగా చేపడుతున్న ప్రజా చైతన్య కార్యక్రమాలకు, వనం - మనం కార్యక్రమాలకు మేలైన ప్రచార వేదికగా ఈ న్యూస్ లెటర్ ఉంటుందని, సిబ్బందిలో సదవగాహనకు దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఎపి రాష్ట్ర అటవీ అకాడమీ సంచాలకులు మరియు రాజమహేంద్రవరం సర్కిల్ అటవీ ముఖ్య సంరక్షణాధికారి శ్రీ జేఎస్ఎన్ మూర్తి ఈ న్యూస్ లెటర్ ప్రచురణ కర్తగా, ప్రధాన సంపాదకునిగా వ్యవహరిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అటవీశాఖ కార్యాలయాలకు, వనసంరక్షణ సమితులకు ప్రతినెలా ఈ న్యూస్ లెటర్ చేరుతుందన్నారు. శాఖాపరమైన విజయగాధల్ని అందరికీ తెలియజేయడం ద్వారా క్షేత్ర స్థాయి సిబ్బందిలో స్ఫూర్తిని కలిగించడం, ఎకో టూరిజం, పర్యావరణ పరిరక్షణ పరంగా ప్రజాచైతన్యం కలిగించడం దీని ఉద్దేశమన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ డివిజన్ అటవీ అధికారిణి డాక్టర్ నందని సలారియా, సీనియర్ జర్నలిస్ట్ దీక్షితుల సుబ్రహ్మణ్యం ఈ వార్తాలేఖ ఎడిటోరియల్ బోర్డు సభ్యులుగా ఉంటారని తెలిపారు.
Comments